దక్షిణాది ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. లక్షల మంది వీరాభిమానుల్ని సంపాదించుకున్న దర్శకులలో మణిరత్నం ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. ఆయనలో ఉత్సాహం తగ్గలేదు. కొన్నేళ్ల కిందట ‘ఓకే బంగారం’ లాంటి ట్రెండీ మూవీ తీసి ఆశ్చర్యపరిచారు. ఆయన నుంచి చివరగా వచ్చిన ‘చెలియా’ ఫ్లాప్ అయినప్పటికీ అది కూడా దర్శకుడిగా ఆయన స్థాయిని పెంచింది.
ఇక మణిరత్నం డైరెక్షన్‌లో తమిళంలో ‘చక్క చివంత వానం’ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగులో ఈ సినిమాకి ‘నవాబు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘లైకా ప్రొడక్షన్స్’తో కలిసి మణిరత్నమే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావు, ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి నటించగా ఇంజనీర్‌గా శింబు , పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి నటించనున్నారు.
ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. బలమైన కథాకథనాలతో .. బంధాలు అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుందని అంటున్నారు. ప్రతి పాత్రను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దారనేది యూనిట్ సభ్యులమాట. ఈ నెలలో టీజర్ ను .. సెప్టెంబర్ మొదటి వారంలో ట్రైలర్ ను రిలీజ్ చేసి సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.