అక్కినేని హీరో సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చి||ల||సౌ’. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రమోషన్ కార్యక్రమాలతో అందరి అటెన్షన్ కొట్టేసిన సుశాంత్ రీ ఎంట్రీతో ఆకట్టుకున్నాడా…?సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…. .
కథ:
వయసు మీద పడితే పెళ్లి సంబంధాలు రావడం కష్టమని అర్జున్ (సుశాంత్)ని పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ మరో ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని మొండికేస్తాడు. అయితే బలవంతంగా అంజలి (రుహానిశర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి తన కుటుంబానికి అండగా ఉంటూ ఉద్యోగం చేస్తుంటుంది. అయితే కుటుంబ పరిస్ధితి నేపథ్యంలో పెళ్లి చూపులకి ఒప్పుకుంటుంది. కానీ పెళ్లిచూపుల తర్వాత ఏం జరుగుతుంది..?వీరి జీవితాలు ఎలంటి మలుపులు తిరిగాయి అన్నదే చిలసౌ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, కథనం,కామెడీ,సుశాంత్,రుహానీ శర్మ. చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించిన సుశాంత్ చక్కని ప్రదర్శన కనబర్చారు. అర్జున్ పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్ చక్కని హావభావాలను ప్రదర్శించారు. కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్. సినిమాకు మరో ప్లస్ పాయింట్ రుహాని శర్మ. కళ్లతోనే చక్కని భావోద్వేగాలు పలికించింది. వెన్నెల కిషోర్ ,విద్యుల్లేఖరామన్, రాహుల్ రామకృష్ణ కామెడీ బాగుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్,ఎడిటింగ్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు.ఎడిటింగ్ బాగుంది. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
పెళ్లంటే ఇష్టం లేని ఓ అబ్బాయి,పెళ్లి తప్పనిసరి అయిన ఓ అమ్మాయి చుట్టూ సాగే కథే చి.ల.సౌ. చిన్న కథలోనే బోలెడన్ని విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నటీనటులు,కామెడీ,సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరు చూడదగ్గ చిత్రం చి.ల.సౌ.
విడుదల తేదీ:03/08/2018
రేటింగ్: 3/5
నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్