ప్రత ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో వరంగల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టి.పల్లవి రెడ్డి సంయుక్తంగా సామాజిక ఇతివృత్తంతో నిర్మిస్తోన్న చిత్రం `మేరా భారత్ మహాన్`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 22న హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ ఆడియో సీడీలు లాంచ్ చేసి వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందజేశారు.
అనంతరం మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…“చిత్ర నిర్మాతలు ముగ్గురూ నాకు ఆప్త మిత్రులు. దేశభక్తితో కూడిన మంచి టైటిల్ సినిమాకు పెట్టారు. బాధ్యతతో తీసిన ఈ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత మనందరి మీదుంది. సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది నటించారు. ఈ సినిమా విజయవంతమై వంరగల్కు చెందిన గొప్ప నిర్మాతలుగా పేరు తెచ్చుకోవాలనీ, ఇలాంటి సామాజిక చిత్రాలు మరెన్నో నిర్మించాలనీ కోరుకుంటున్నా“ అని అన్నారు.
బాబూమోహన్ మాట్లాడుతూ…“ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను హైదరాబాద్ నుంచి ఈ ఫంక్షన్‌కు వచ్చానంటే నా ఓరుగల్లులో..నాకిష్టమైన దర్శకుడు భరత్ సినిమా ఆడియో ఫంక్షన్ కాబట్టి. ఇందులో నేను కూడా ఒక అద్భుతమైన పాత్ర చేశాను. భరత్ ఎంతో గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ, కొన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి. కానీ ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ కొట్టబోతున్నాడని అర్థమవుతోంది. నిర్మాతలు కూడా ఎంతో అభిరుచితో సినిమాను నిర్మించారు. అందరికీ ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా“ అన్నారు.
మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి మాట్లాడుతూ…“నేను హ్యూమర్ బాగా రాయగలను. పాలిటిక్స్‌కి ఎగైనెస్ట్‌గా కూడా బాగా రాయగలను. ఒక మంచి పొలిటికల్ సెటైరికల్ ఫిలింకి రాయాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరిందని“ అన్నారు… `త్రిముఖి` దర్శకుడు యాదకుమార్ మాట్లాడుతూ…“భరత్ సినిమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. పాటలు బావున్నాయి. ట్రైలర్లో కంటెంట్ ఆలోచింపజేసేవిధంగా ఉంది. నిర్మాతలు బాధ్యతతో తీసిన ఈ సినిమాను హిట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్ మాట్లాడుతూ…“శ్రీధర్ రాజ్ ఈ కథ రెడీ చేసుకుని ఓ మంచి దర్శకుడి కోసం వెతుకుతున్న క్రమంలో భరత్‌ని పరిచయం చేశాను. భరత్‌కు కథ నచ్చి సింగిల్ సిటింగ్ లోనే ఓకే చెప్పారు. అంతే అద్భుతంగా తీశారు. డబ్బుకోసమో, పేరు కోసమో మా నిర్మాలు ఈ సినిమా చేయలేదు. అది వారికి బోలెడంత ఉంది. కేవలం ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి నిర్మాతలు ఈ సినిమా చేశారు. అందరం సిన్సియర్‌గా కష్టపడ్డాం. మా కష్టం ఫలిస్తుందన్న నమ్మకం ఉందని“ అన్నారు.
పాటల రచయిత పెద్దాడమూర్తి మాట్లాడుతూ…“మంచి పాటలు రాయాలంటే మంచి సందర్భాలు ఉండాలి. అంత మంచి సందర్భాలు ఇచ్చిన దర్శకుడు భరత్‌కు, ఇంత మంచి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు, చక్కటి బాణీలు ఇచ్చిన లలిత్ సురేష్‌కు నా ధన్యవాదాలు“ అన్నారు.లలిత్ సురేష్ మాట్లాడుతూ…“పాటలు బాగా వచ్చాయంటే అంత మంచి కంటెంట్ వల్లే. ఇందులో 8 పాటలు ఉన్నాయి. పెద్దాడమూర్తి చాలా బాగా రాశారు“ అని తెలిపారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ…“ఏ సమస్యైనా మన చేతుల్లోనే ఉంది. ఫస్ట్ వినేలా చెప్పాలి.. వినకుంటే చెంప చెళ్లుమనిపించైనా చెప్పాలి అనేది మా చిత్ర కథాంశం. విద్య, వైద్యం సామాన్యుడికి అందడం లేదు. డబ్బున్న వాళ్లకే సరైన విద్య, వైద్యం దక్కుతున్నాయి. మరి లేని వారి పరిస్థితి ఏంటి? దీనికి కారణం ఏంటి? సిస్టమ్‌లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి వాటిని సవరించండి అని చెప్పే ప్రయత్నమే తప్ప ఎవరికీ వ్యతిరేఖంగా సినిమా ఉండదు. నిర్మాతల్లో ఒకరైన శ్రీధర్ రాజు కథతో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. యువత భవిష్యత్ కోసం తీసిన సినిమా కాబట్టి వారే జనాల్లోకి ఈ సినిమా తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. లలిత సురేష్ బాణీలకు, పెద్దాడమూర్తి ఆలోచింపజేసే సాహిత్యాన్ని సమకూర్చారు. సాంకేతిక నిపుణులు, నటీనటులు అందించిన సహాయంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాం“ అన్నారు.
నటుడు వేణుమాధవ్ మాట్లాడుతూ…“మీరు డాక్టర్స్ కాబట్టి MBM కాకుండా MBBS అని టైటిల్ పెడితే బాగుండేది అన్నాను నిర్మాతలతో. కానీ, వారు మమ్మల్ని డాక్టర్స్ చేసిన భారతదేశం మీద ప్రేమతో `మేరా భారత్ మహాన్` అనే టైటిల్ పెట్టాం అనడంతో నాకు చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చూశాను భరత్ చాలా ఎమోషనల్‌గా తీశారు. ఈ సినిమాలో నేను ఎందుకు నటించ లేదా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమాకు నేను అన్ని విధాలుగా సపోర్ట్ నివ్వడానికి రెడీగా ఉన్నాన్నారు.
హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ….“భరత్‌తో వర్క్ చేశాక తెలుగు పరిశ్రమకు ఆయన మరో శంకర్ గారిలా అనిపించారు. ఈ సినిమా చేయడం గొప్ప అనుభూతి“ అన్నారు.. నిర్మాత డా.తాళ్ల రవి మాట్లాడుతూ…“ముగ్గురం డాక్టర్లం కలిసి ఈ సినిమాను నిర్మించాం. పబ్లిక్ కు ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ ఇస్తున్నాం. శ్రీధర్ రాజ్ కథను భరత్ అద్భుతంగా డీల్ చేశారన్నారు.
కథా రచయిత, నటుడు, డా.శ్రీధర్ రాజ్ మాట్లాడుతూ…“మా వరంగల్‌లో ఆడియో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వరంగల్ పోరుగడ్డ. ఏ ఉద్యమం అయినా ఇక్కడే మొదలవుతుంది. సగటు మనిషి పడుతున్న బాధలు మా సినిమాలో చూపించాం. ప్రభుత్య పాలసీల గురించి చర్చించాం. ప్రజలకు ఉపయోగపడే సినిమా. సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు జోడించి భరత్ అద్భుతంగా తీశారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు సహకరించారు. నేను కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ సీనియర్ నటులు సపోర్ట్‌తో చేశాను“ అన్నారు.
మరో నిర్మాత పల్లవి రెడ్డి మాట్లాడుతూ…“యంగ్ స్టర్స్ కోసం చేసిన సినిమా. వారే వారి భుజాలపై వేసుకోని హిట్ చేయాలి. ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నాం“ అన్నారు… ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక శర్మ, కావ్య కీర్తి తో పాటు వరంగల్‌కు చెందిన మూడు వందల మంది డాక్టర్స్ పాల్గొనడం విశేషం.
బాబు మోహన్, తణికెళ్ల భరణి, గిరి బాబు, ఆమని, నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, బాలాజీ, సుదర్శన్, సుమన్‌శెట్టి, అపూర్వ, దాసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరిః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డైలాగ్స్ః యర్రంశెట్టి సాయి, పాటలుః పెద్దాడమూర్తి, చిలకరెక్క గణేష్, ఎడిటర్ః మేనగ శ్రీను, ఫైట్స్ః విజయ్, మేకప్ః యాదగిరి, పబ్లిసిటీ డిజైనర్ః రాంబాబు, స్టిల్స్ః వేణు, కాస్ట్యూమ్స్ః వల్లి, పిఆర్వోః రమేష్ బాక్సాఫీస్, ఆర్ట్ః పి.డేవిడ్, సినిమాటోగ్రఫీః ముజీర్ మాలిక్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః వల్లమాటి వెంకట్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ః కె.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరక్టర్ః విజయ్, అసోసియేట్ డైరక్టర్ః కృష్ణ ప్రసాద్, కో-డైరక్టర్ః రాజానంద్, కొరియోగ్రాఫర్స్ః స్వర్ణ, దిలీప్, సంగీతం: లలిత్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః సోమర్తి సాంబేష్, ప్రొడ్యూసర్స్ః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, తోకల పల్లవి రెడ్డి, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: భరత్.