గ్రేటర్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం,టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ నేతలు విస్త్రృత స్ధాయి సమావేశం నిర్వహించగా…అదికాస్త రసాభాసగా మారింది. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ స్ధానంపై మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్,అజారుద్దీన్‌ల మధ్య విభేదాలకు దారి తీసింది.
వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానంటూ అజారుద్దీన్ బహిరంగ ప్రకటన చేశారు. అయితే దీనిపై అంజన్ మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎంపీ స్ధానం నుంచి తానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అయితే దీనిపై అజార్ సైతం అదేస్ధాయిలో స్పందించారు. దమ్ముంటే హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఒకవేళ అజారుద్దీన్ కు సికింద్రాబాద్ సీటు ఇస్తే అంజన్ ను ముషీరాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్ కు మార్చాల్సి ఉంటుంది. అయితే,దీనికి అంజన్ ఊ కొడతారా లేదా అన్నది సందిగ్దంగా మారింది. 2009 ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన అజార్… 2014 ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.