టీఆర్ఎస్‌తో బీసీల అభివృద్ధి:దానం

248
Danam Nagender
- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీలో బడుగు,బలహీన వర్గాలకు ప్రాధాన్యం లేదని ఆరోపించారు మాజీ మంత్రి దానం నాగేందర్. ఫిల్మ్‌ నగర్‌లో మీడియాతో మాట్లాడిన దానం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గల కారణాలను వివరించారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న తనను సంప్రదించకుండానే చాలామందికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. ఇది తప్పుడు సంకేతం వెళ్తుందని అప్పుడే పార్టీ ఇంఛార్జీ కుంతియాకు తెలిపానన్నారు.

బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు దానం. బీసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి  సీఎం కేసీఆర్ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికలో బడుగులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ఏ బాధ్యత అప్పగించిన నెరవేరుస్తానని చెప్పారు. టీఆర్ఎస్ తోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు.

ఢిల్లీ చుట్టు తిరిగే నాయకులకే కాంగ్రెస్‌లో ప్రాధాన్యం పెరిగిందన్నారు. కాంగ్రెస్‌లో అన్నివర్గాలకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు.నిబద్దత కలిగిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని కానీ ఒకే వర్గానికి ప్రాధాన్యత లభించడం బాధాకరమన్నారు.

బీసీలకు పార్టీలో తగినంత ప్రాధాన్యత లభించక లేకపోవడంతో వారంతా పార్టీకి దూరమవుతున్నారని చెప్పారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారం రాహుల్,ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. బలహీనవర్గాలను ఎదగనివ్వడం లేదని సీనియర్ నేతలు వీహెచ్‌,పొన్నాలను సైతం పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పీతల వల్లే ఈ దుస్ధితి వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌లో తప్ప అన్నిపార్టీల్లో బీసీలు మంత్రులు అయ్యారని మండిపడ్డారు. గెలిచినా,ఓడినా కార్యకర్తలు తనవెంటే ఉన్నారని చెప్పారు దానం. పీసీసీ అధ్యక్షుడు చెప్పిన మాటకే విలువలేకుండా పోయిందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉత్తమ్‌కు సైతం వివరించానని చెప్పారు. ఆత్మగౌరవం లేనిచోట ఉన్నా ఒకటే లేకున్న ఒకటే అన్నారు. పార్టీ ప్రతిష్టను ఎప్పుడు దిగజార్చే ప్రయత్నం చేయలేదన్నారు. అహర్నిషలు పార్టీ కోసం కష్టపడితే తన ప్రాధాన్యం తగ్గించడం బాధకలిగించిందన్నారు.

- Advertisement -