వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతండటంతో రాష్ట్రమంతట భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. మరో 5 ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని కాలనీల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్ధితి కనిపించడం లేద. జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.
గత 24 గంటల్లో మెదక్‌లో 7 సెంటీమీటర్లు, మద్నూరులో 5, శాయంపేట, ఆత్మకూరులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి.