ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, కొత్త జోనల్ విధానం, ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల పెంపు , అభివృద్ధి పనులు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోడీకి ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
అంతే కాకుండా మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న రైతు బంధు పథకాన్ని మోడీకి సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమస్యలు , ఆస్తుల పంపకాలు వంటి పలు అంశాలపై మోడీతో చర్చించారు సీఎం కేసీఆర్.
ఢిల్లీలోని ఏపీ భవన్ ను తెలంగాణకే కేటాయించాలని, హైకోర్టు విభజన సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ మోడీని కోరారు. రాష్ట్ర వాటా కింద కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానున్న రైతబీమా పథక ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ మోడీని ఆహ్వానించారు. దీంతో పాటు ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధించాలని ప్రధాని మోడీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.