మీరు ఫేస్బుక్లో చురుకుగా ఉన్నారా..? ప్రతి విషయాన్ని మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారా..? అయితే మీరు ఏదైనా విషయాన్ని పోస్టు చేసేముందు ఆలోచించండి. లేదంటే ఆ పోస్టే మీ అనర్ధానికి దారితీస్తుంది. అలాంటి సంఘటనే బెంగళూరుకు చెందిన ఓ యువతికి జరిగింది. తాను ఊరికి వెళ్తున్నానని, ఫేస్‌బుక్‌కి రెండు రోజుల విరామం అంటూ పోస్టు చేసింది. అంతే ఆ పోస్టే ఆమె ఇంట్లో దొంగలు పడేలా చేసింది.
వివరాల్లోకి వెలితే.. బెంగళూరు టీ నగర్ పరిధిలో నివాసముండే ప్రేమ అనే యువితి, తన ప్రతి విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండేది. ఇదే క్రమంలో గత శనివారం తాను రెండు రోజులు ఊరికి వెళ్తున్నట్లు పోస్టు చేసింది. ఈ పోస్టు ఓ దొంగల కంటపడిందో తెలియదు గానీ.. ఆ యువతి ఇంటిని దొంగలు స్వాహా చేశారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ.5 లక్షల విలువగ నగలు దోచుకెళ్లారు.
ఇక నిన్న ఉదయం ఊరు నుంచి తిరిగి వచ్చిన యువతి ఇంట్లో దొంగలు పడడంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే తాను ఫేస్బుక్లో ఊరికి వెళ్తున్నట్లు పోస్టు చేయడం వల్లే ఈ దొంగతనం జరిగిందంటూ.. ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.