ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి మావోయిస్టులు కుట్ర పన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు వరవరరావు. ఆ కుట్ర నాటకంలో తన పేరు తెరపైకి రావడం మరింత హాస్యాస్పదం అని ఓ పత్రికకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. రోజురోజుకూ తన ప్రాబల్యాన్ని కోల్పోతున్న బీజేపీ ఈ నీచమైన కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు.
పుణే పోలీసులు చెబుతున్న లేఖలో ఆత్మాహుతి దాడికి రహస్య ప్రణాళిక వేసినట్లు ఉంది. ఆత్మాహుతి దాడి చేయాలనుకునే వారికి ఈవిధమైన రహస్య ఎజెండా ఉండదు. దీన్ని బట్టే అది బోగస్ లేఖ అని తెలిపారు. అని చెప్పవచ్చు’ అని వరవరరావు అన్నారు. మావోయిస్టు పార్టీలో ఎవరు ఎవరికీ అలాంటి లేఖ రాసి ఉండరు. ఆర్ అనే వ్యక్తి పేరుతో లేఖ రాశారని చెబుతున్నారు. దాన్ని ఏవిధంగా విశ్వసిస్తామని ప్రశ్నించారు. 2019లో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన తరహాలో ఆత్మాహుతి దాడి ద్వారా ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారంటూ పుణె పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి నుంచి లభించిన లేఖను బహిర్గతం చేశారు పోలీసులు.