ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2018 పరీక్ష ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఢిల్లీకి చెందిన కల్పనా కుమారి 99.99 శాతంతో టాపర్‌గా నిలవగా తెలంగాణకు చెందిన రోహన్ పురోహిత్ రెండో ర్యాంకు సాధించారు. దివ్యాంగుల క్యాటగిరీలో కరీంనగర్‌కు చెందిన విద్యార్థి దేవసహాయం జాతీయస్థాయి మొదటిర్యాంకు సాధించారు. నీట్-2018 పరీక్షకు 12.69 లక్షలమంది హాజరుకాగా, 7.14 లక్షలమంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 6.30 లక్షలమంది జనరల్ క్యాటగిరీకి చెందినవారే కావడం విశేషం. ఉత్తీర్ణులైనవారిలో 3.12 లక్షలమంది బాలురు, 4.02 లక్షలమంది బాలికలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం తండాకుచెందిన లావుడ్య హర్షవర్ధన్ నీట్‌లో జాతీయస్థాయి ఎస్టీ క్యాటగిరీలో ఐదో ర్యాంకు ఓపెన్ క్యాటగిరీలో 605 మార్కులతో 1,267వ ర్యాంక్ సాధించాడు. హర్షవర్ధన్ హైదరాబాద్‌లోని కొంపెల్లి శ్రీ చైతన్యలో చదవి ఇంటర్ బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించా డు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల తండాకుచెందిన నందిత ఎస్టీ క్యాటగిరిలో 9వ ర్యాంక్ సాధించింది.
గత ఏడాదికి నీట్‌కు 11.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే ఈసారి 13 లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ సంస్థలలో 60,000 ఖాళీలు ఉంటాయి. 2013 లోనే నీట్‌ను తీసుకొచ్చినా తర్వాతి ఏడాదిలోనే రద్దు చేశారు. ఆ తర్వాత మూడేళ్లు ఎవరికి వాళ్లు(అన్ని రాష్ట్రాలు) ప్రత్యకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకున్నాయి. కానీ 2016 నుంచి నీట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు నీట్ ఫలితాలపై స్టే ఇవ్వాలని వేసిన పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.