భారత సైన్యం చేసిన సర్జికల్ దాడి పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. ఒకవైపు అవమానం భారంతో పాక్ సైన్యం.. ప్రతీకారంతో ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఆర్మీపై దాడులు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కశ్మీర్ లోకి వచ్చినట్లు ఇంటిలిజెన్స్ పేర్కోంది. ఇటీవలే దాదాపు 250మందికి పైగా ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలో నక్కి ఉన్నట్లు భారత్ ప్రభుత్వానికి సమాచారం అందింది.
లష్కర్-ఈ-తోయిబా, జైష్-ఈ-మొహమ్మద్, హిజ్బుల్ మొజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్స్ కు ముందే కశ్మీర్ లోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పటినుంచి కశ్మీర్ లోనే వీరందరూ తలదాచుకుంటున్నారని పేర్కొంది.ఈ నేపథ్యంలో జమ్ము కాశ్మీర్లోని పదికి పైగా ప్రాంతాల్లో భారత సైన్యం పెద్ద ఎత్తున స్థానిక పోలీసులతో కలిసి సోమవారం రాత్రంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. గంటలపాటు సాగిన ఈ దాడుల్లో పలు ఇండ్ల నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, పాకిస్థాన్, చైనా జాతీయ జెండాలు లభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు 44 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఖ్వాజీ హమన, గనాయి హమన్, తవీద్ గంజ్, జామియా సహా 10 కీలకమైన ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టాయి. దాదాపు 700 ఇళ్లల్లో సోదాలు చేశామని, పెట్రోల్ బాంబులు, పాక్, చైనా జెండాలు స్వాధీనం చేసుకున్నామని, 44 మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మనీశ్ కుమార్ చెప్పారు. పెల్లెట్ దెబ్బలు తిన్న ఆందోళనకారులను కూడా పరామర్శించినట్లు చెప్పారు. లష్కరే హెచ్చరికల నేపథ్యంలో 44 మంది యువకులను విచారిస్తున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఆ యువకులను విచారిస్తోన్న బారాముల్లా పోలీసులకు పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హెచ్చరికలు జారీచేసింది. ప్రతీకారం తప్పదని ఉగ్రవాదులు బెదిరించే ప్రయత్నం చేసినట్లు బారాముల్లా పోలీసులు మీడియాకు తెలిపారు.