ఒలింపిక్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా

208
- Advertisement -

భారత స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇటీవలె చెన్నైకు చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్)ను ప్రదానం చేసింది. వర్సిటీ చాన్స్‌లర్‌ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం చేశారు. తాజాగా అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అథ్లెట్స్ క‌మిష‌న్‌లో సైనాను సభ్యురాలిగా నియమించారు. స‌భ్య‌త్వానికి సంబంధించి ఐఓసీ ప్రెసిడెంట్ థామ‌స్ బాచ్ పంపిన లేఖ సోమ‌వారం సైనాకు చేరింది.

Saina-Nehwal

అథ్లెట్స్ క‌మిష‌న్‌లో సైనాను స‌భ్యురాలిగా చేర్చేందుకు ఒలింపిక్ క‌మిటీ నిర్ణ‌యించింద‌ని బాచ్ ఆ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. అథ్లెట్స్ క‌మిష‌న్‌కు ఏంజెలా రూగ్గిరో చైర్మ‌న్‌గా ఉన్నారు. ఆ క‌మిష‌న్‌లో మొత్తం తొమ్మిది మంది ఉపాధ్య‌క్షులు, మ‌రో ప‌ది మంది స‌భ్యులు ఉంటారు. న‌వంబ‌ర్ 6వ తేదీన మ‌ళ్లీ అథ్లెట్స్ క‌మిష‌న్ భేటీకానుంది. రియో ఒలింపిక్స్ లో గాయ‌ప‌డ్డ సైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మ‌ళ్లీ ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన త‌రుణంలో ఈ శుభ‌వార్త విన‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆమె తండ్రి తెలిపారు. మోకాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న సైనా మ‌ళ్లీ న‌వంబ‌ర్‌లో పూర్తి స్థాయిగా టోర్నీల‌కు హాజ‌రుకానున్న‌ట్లు ఇటీవ‌లే వెల్ల‌డించింది. ఒలింపిక్ ప్యాన‌ల్‌లో సైనాకు స‌భ్య‌త్వం రావ‌డం ప‌ట్ల ఆమె తండ్రి హ‌ర్‌విర్ సింగ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

- Advertisement -