నిపా వైర్‌స కేరళను వణికిస్తోంది. ఈ అరుదైన వైరస్ సోకడంతో ఇప్పటివరకూ కోజికోడ్‌లో 10 మంది మరణించారు. మరొకరికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరో ఎనిమిది మంది వైద్య నిపుణుల పరిశీలనలో ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. రెండు ‘‘కంట్రోల్ రూమ్’’లనూ ఏర్పాటు చేశారు. అయితే ఎవరూ భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇన్ఫెక్షన్ సోకినవారు పరిసరాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించింది. ప్రస్తుతం మృతి చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో 20ల వయసులో ఉన్నవారు ఇద్దరున్నారు. అత్యవసర చికిత్స పొందుతున్న వ్యక్తి వీరి తండ్రే. వీరు నివసించే చోట ఓ బావిలో మృతిచెందిన గబ్బిలాలను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.
ప్రస్తుతం ఆ బావిని మూసివేయించినట్లు వివరించారు. గబ్బిలాల ద్వారా గతంలో ఈ వైరస్ వ్యాప్తిచెందడం గమనార్హం. ఈ వైరస్ వల్ల మరణించిన ముగ్గురికీ చికిత్స అందించిన ఓ నర్సు సోమవారం మృతిచెందారు. మరో ఇద్దరు నర్సులు తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అయితే దీనికి వైరస్సే కారణమా? అనే అంశంపై స్పష్టతలేదు. మరోవైపు కోజికోడ్‌కు పొరుగునున్న మళప్పురంలోనూ తీవ్రమైన జ్వరంతోపాటు నిపా ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఐదుగురు మరణించారు. వీరి మృతుల విషయంలోనూ స్పష్టతలేదు. దీంతో వైరస్‌ను కట్టడిచేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీఇచ్చింది. నిపా సోకినవారికి వైద్యం నిరాకరించొద్దని ప్రైవేటు ఆసుపత్రులకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. కేంద్రం సైతం ఉన్నత స్థాయి వైద్య నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించేందుకు నిపుణులు తోడ్పడతారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
నిపా వైరస్ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాణాంతక వైరస్ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళలోని కోజికోడ్ తదితర ప్రాంతాల్లో 23 మంది నిపా వైరస్ బాధితులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందట వీరంతా జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. కొందరిలో మెదడువాపు లక్షణాలు కనిపించాయి. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.
తొలిసారిగా నిపా వైర్‌సను 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైర్‌సను కనుగొన్నారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన రోగుల నుంచి తొలిసారిగా ఈ వైర్‌సను కనుగొనడంతో దీన్ని నిపా వైర్‌సగా నామకరణం చేశారు. 2004లో బంగ్లాదేశ్‌లో కూడా ఈ వైరస్ ప్రబలి, మరణాలు సంభవించాయి.
అనంతరం మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది. నిపా వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్, మయోకార్డైటిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తాయి.