జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథం(నరేగా)ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్…సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. రైతులు చనిపోతే రూ. 6 లక్షల ఇన్సురెన్స్ ఇచ్చిన ఘనత తమదే అన్నారు.
వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే డబ్బు రూ.6 వేల కోట్లు బ్యాంకులో ఉన్నాయని సీఎం చెప్పారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి..నీళ్లుండాలి..కరెంట్ ఉండాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేసినం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఉద్యమాల ద్వారా అధికారం చేపట్టి.. ప్రజల హృదయాలు గెలుచుకున్న ఏకైక పార్టీ తెరాస. యావత్ దేశానికి తెలంగాణ కేంద్ర బింధువుగా మారింది. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు పథకం ద్వారా రూ.12వేల కోట్ల రూపాయలు రైతులకు అందిస్తున్నాం అని వివరించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాను వాటర్‌హబ్‌గా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో పల్లెలన్నీ బాగుపడ్డాయని..ఇంకా బాగుపడాల్సిన అవసరముందని ఈటల అభిప్రాయపడ్డారు.