దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఐదు రోజులు పెరోల్ ఇచ్చింది. ఈ నెల 12న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం సందర్భంగా… ఐదు రోజుల పాటు పెరోల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కోర్టు అంగీకరించినట్టు సమాచారం. లాలూకి పెరోల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదంటూ జార్ఖండ్ ఏజీతో పాటు రాంచీ ఎస్‌పీ తెలపడంతో పెరోల్ మంజూరైనట్టు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది.
బిహార్‌కు చెందిన మంత్రి చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను తేజ్ ప్రతాప్ పెళ్లాడబోతున్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు. పెళ్లికి హాజరయ్యేందుకు లాలూకు పెరోల్ ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
లాలూ కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతుండడంతో ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతించింది. చికిత్స అనంతరం లాలూ కోలుకోవడంతో ఇటీవల ఆయన్ని డిశ్చార్జి చేశారు. కానీ తాను పూర్తిగా కోలుకోలేదని లాలూ చెబుతున్నారు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు ఎయిమ్స్ అత్యవసర విభాగంలోని పరికరాలను ధ్వంసం చేసి ఆందోళనలు చేపట్టారు. తనకు మున్ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎయిమ్స్‌దే బాధ్యతని లాలూ హెచ్చరించారు.