నగరంలో ట్రాఫిక్ జామ్‌కి చెక్ చెప్పేందుకు విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. సింహ భాగం జీహెచ్‌ఎంసీ నిధులతో, కేంద్రం సహకారంతో 4 ప్రధాన ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ అంకురార్పణ చేసింది. ఇటీవలే హైదరాబాద్‌లో పలు చోట్ల అండర్ పాస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రహదారుల విస్తరణ, స్కై వేల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు అలాగే ఆరాంఘర్-మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
అలాగే, రూ.426.52 కోట్ల అంచనాతో హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్‌లో 62.92 కిలోమీటర్ల నిడివి గల డబుల్‌లేన్ల జాతీయ రహదారికి, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, శంషాబాద్ సెక్షన్‌లో 10.48 కిలోమీటర్ల నిడివి గల ఆరు వరుసల రహదారికి కూడా శంకుస్థాపనలు చేశారు. అంబర్‌పేటలోని శ్రీరమణ థియేటర్ చౌరస్తా నుంచి ఛే నంబర్ కూడలి వరకు, అలాగే, ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.