తెలంగాణలో డయేరియాను తరిమికొట్టేందుకు సహకారం అందిస్తామని మెర్క్ కంపెనీ తెలిపినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలో రెండో రోజు పర్యటిస్తున్న కేటీఆర్ గ్లోబల్ ఫార్మా, మెర్క్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఫార్మా దిగ్గజం మెర్క్ కంపెనీ కార్యనిర్వాహఖ ఉపాధ్యాక్షుడు సనత్ చోటపాధ్యాయతో సమావేశమైన మంత్రి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణ నుంచి డయేరియాను తరిమికొట్టేందుకు సహకారం అందిస్తామని మెర్క్ కంపెనీ ప్రకటించింది. కేటీఆర్ ఆహ్వానం మేరకు మెర్క్ కంపెనీ ప్రతినిధులు వచ్చే నెల నగరానికి రానున్నారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీని ద్వారా వ్యాక్సిన్ తయారీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పని చేస్తుంది. తెలంగాణలో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా మెర్క్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా టీబీ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అంగీకరించింది. జాన్సన్ అండ్ జాన్సన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
ఫైజర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా కేటీఆర్‌కు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసి ఈసీహెచ్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఫార్మారంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న రిచ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని మంత్రి వారిని కోరారు. యూఎస్‌ఎఫ్‌డీఏతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలో కేటీఆర్ పాల్గొన్నారు. ఫార్మా సిటీ ద్వారా మెడికల్, హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒకే చోటుకు తీసుకొచ్చేందుకు ఒప్పందం జరిగింది.