ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి ఇక లేరు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. రామచంద్రారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామం. రెండురోజుల క్రితం ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లో జారిపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో శాసనసభాపతి, మంత్రిగా పనిచేశారు.
మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషిచేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని కొనియాడారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీ సమీపంలోని స్మశానవాటికలో జరగనున్నాయి.