తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ సంస్కృతి ఖండాంతరాలు దాటింది. లండన్‌లో, అమెరికాలో.. ఇలా పలు దేశాలు తిరుగతూ కువైట్‌కి చేరింది మన బతుకమ్మ. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండే కువైట్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత.. తెలంగాణకు చెందిన ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి కువైట్ శాఖ ఈ వేడుకలను నిర్వహించింది. కువైట్‌లోని అబాసియా ప్రాంతంలో జరిగిన కార్యక్రమం లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి కవిత బతుకమ్మ పాటలు పాడుతూ ఆడా రు. టూరిస్టిక్ పార్క్ వరకు బతుకమ్మలను తీసుకెళ్లి అక్కడ కూడా కొద్దిసేపు ఆడారు.
కవిత తామందరికీ సోదరి అని, అందుకే ఆమె తమ ఇంటికొచ్చిందని భావోద్వేగంతో చెప్పారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే చాలు ఆడపిల్లలు ఎక్కడున్నా సొంతూరుకు వస్తారని, ఆ ఇంట్లో ఆనందం నింపుతారని తెలిపారు. మా ఆత్మీయ సోదరి కవిత కువైట్ కు మా కోసమే వచ్చిందని, మా అందరి ఇండ్లలో పండుగ వాతారణం నింపిందని వారు సంతోషాన్ని పంచుకున్నారు. ఎంపి కవితకు బొట్టు పెట్టి మరీ ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుటుంబాలకు దూరంగా ఉన్న మీ అందరికీ తనతోపాటు తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అండగా ఉంటుందన్నారు. ఏ కష్టమొచ్చినా తాను ఉన్నానన్న సంగతి మరిచిపోవద్దన్నారు.