ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రానికి రెండో భాగంగా రూపొందుతున్న బాహుబలి ది కన్‌క్లూజన్ తెలంగాణ(నైజాం) హక్కులను ఏషియన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు నారాయణ్‌దాస్ నారంగ్, సునీల్ నారంగ్‌లు 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. భారీ మొత్తానికి హక్కులను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ సందర్భంగా ఏషియన్ ఎంటర్ప్రైజెస్ అధినేతలు నారాయణ్‌దాస్ నారంగ్, సునీల్‌నారంగ్ మాట్లాడుతూ గతంలో మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలంగాణలో పంపిణీచేశాం. తాజాగా బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా పోటీ మధ్య బాహుబలి ది కన్‌క్లూజన్ హక్కులను పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నాం. బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసిందే. దాంతో బాహుబలి ది కన్‌క్లూజన్‌పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు.