అవును.. వాట్సాప్ ద్వారా ఎన్నికల నామినేషన్ ను స్వీకరించాలంటూ..పశ్చిమ బెంగాల్ రాష్ర్ట్ట ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ విషయం తెలిసిన వారంతా ఒక్కసారిగా అవాక్కైయ్యారు. నిజంగా ఇది దేశ ఎన్నికల చరిత్రలోనే సంచలనం. అయితే ఇలాంటి ఆదేశాలను కోర్టు ఎందుకు ఇవ్వాల్సివచ్చిందనేదే ఇక్కడ హాట్ టాపిక్.
ఇక అసలు విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ర్టం దక్షిణ 24 పరగనాల జిల్లా భన్గర్ ఏరియా పోలర్ హాట్ 2 గ్రామ పంచాయితీ ఎన్నికలకు నోటీఫికేషన్ విడుదలైంది. అయితే గ్రామంలో రెండు వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందునా.. ఓ వర్గంవారి బెదిరింపులు, దాడులతో నామినేషన్ కూడా దాఖలు చేయలేని పరిస్థితి. ఇక అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని 9 మంది కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
తమ గ్రామంలోని పరిస్థితులను కోర్టుకు విన్నవిస్తూ..వాట్సాప్ ద్వారా నామినేషన్ ప్రత్రాలను ఎన్నికల అధికారికి పంపినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న ఈ 9మంది నామినేషన్లను పరిగణంలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కోల్ కతా హైకోర్టు.
కాగా.. విషయంపై సీనియర్ అడ్వకేట్ అరవింద్ దత్తార్ మాట్లాడుతూ…వాట్సాప్ ద్వారా ఎన్నికల నామినేషన్ అంగీకరించడం అనేది ప్రత్యేక పరిస్థితుల్లో..ప్రత్యేక కేసుగా పరిగణించి హైకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఇక ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది.