అభివృద్ధి దిశగా పయనిస్తున్న తెలంగాణ.. దేశ విదేశాల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న నేపధ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె జైన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును సోమవారం క్యాంపు కార్యాలయంలో తన బృందంతో కలిశారు.
హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారం బుణం రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న పట్టణాల పరిదిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఇండియన్ బ్యాంకు ముందుకు రావడం శుభ పరిణామమని, వారిని తాను ఆహ్వానిస్తున్నానని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవా రంగంలో వ్యవస్థల బలోపేతానికి ఇండియన్ బ్యాంకు అందించే ఆర్థిక సహకారం దోహదం పడుతుందని సిఎం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్మారెడ్డి, సిఎంట ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతికుమారి, టిఎస్ఐపాస్ ఎండీ నరసింహారెడ్డి, సమాచారశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.