ISIS కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు చనిపోయినట్టు తెలిపారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్. ఈ రోజు(మార్చి20) రాజ్యసభలో మాట్లాడిన సుష్మా ఈ విషయాల్ని వెల్లడించారు. 2014లో ఇరాక్ లోని మోసుల్‌లో ISIS 39 మంది భారతీయులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను బాగ్ధాద్‌కు పంపించినట్లు తెలిపారు సుష్మా.
మృతదేహాల డీఎన్‌ఏ టెస్ట్ కోసం వారి బంధువులను అక్కడికి పంపిచామని కూడా తెలిపారు. అన్ని మృతదేహాల్లో ఒక వ్యక్తి డీఎన్‌ఏ శాంపిల్స్ 70 శాతం మాత్రమే కలిశాయన్నారు. అయితే చనిపోయినవారిలో ఎక్కువగా పంజాబ్ కు చెందిన వారే ఉన్నారని, అందులో హిమాచల్,పశ్చిమబెంగాల్, బీహార్ ప్రాంత వాసులు కూడా ఉన్నారని సుష్మా చెప్పారు.
కాగా… ఇరాక్ వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను తీసుకొస్తామని, మొదట అమృత్‌సర్ కు తర్వాత పాట్నా, కోల్‌కతా ప్రాంతాలకు ప్రత్యేక విమానాన్ని పంపిస్తున్నామని తెలిపారు ఆర్మీ జనరల్ వీకే సింగ్.
ఈ క్రమంలోనే ఇరాక్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని రాజ్యసభలో రెండునిముషాలపాటు మౌనం పాటించారు. ఇదిలా ఉండగా సుష్మా స్టేట్ మెంట్ కు ట్విట్టర్ లో స్పందించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.