తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని చేయిస్తానని మొక్కుకున్న సంగతి తెలిసిందే. మొక్కులో భాగంగా సతీసమేతంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి చేరుకున్న సీఎం అమ్మవారికి మొక్కు చెల్లించారు.దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా అమ్మవారికి రూ.3.70కోట్ల విలువ గల 11 కిలో ల 700గ్రాముల స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు.ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు ఆలయ అధికారులు వేదమంత్రాలు,పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జీఆర్‌టీ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో ఈ కిరీటాన్ని తయారు చేయించారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటంతోపాటు కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి, విజయ వాడ కనకదుర్గ మ్మ అమ్మవారికి కిరీటాలు సమర్పిస్తామని మొక్కుకున్న సంగతి తెలిసిందే. మొక్కులో భాగంగా భద్రకాళి అమ్మవారికి సీఎం బంగారు కీరిటాన్ని సమర్పించారు. 2017 మార్చిలో కురవిలో జరిగే ఉత్సవాల్లో కురవి వీరభద్రస్వామికి మీసాలు సమర్పించనున్నారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని దాదాపు రెండు కిలోల బరువుతో వజ్రవైఢూర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. దీనికి దాదాపు 5 కోట్ల 59 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తయారీ బాధ్యతను టీటీడీకే అప్పగించింది ప్రభుత్వం. ఈ కిరీట తయారీ బాధ్యతను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, గతంలో టీటీడీ ఈఓ గా పని చేసిన అనుభవం ఉన్న డాక్టర్ కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.