అవును వర్మ. వైసీపీని దూరం పెట్టాడు. ఇంతకూ.. వైసీపీకి వర్మకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ఎన్టీఆర్‌కు లక్ష్మీకి ఉన్న సంబంధం. ఈ సంబంధాన్ని బేస్ చేసుకుని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మనోడు మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకుంది…సినిమా తీయడంలో కాదు..నిర్మాత విషయంలో. అసలు విషయానికొస్తే ఈ సినిమా నిర్మాతను మార్చేశాడు వర్మ..ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజ్ లో ప్రకటించేశాడు.
చాలా రోజుల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తానన్న వర్మ..అందుకోసం ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను..టైటిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు నిర్మాతగా వైసీపీ నేత రాకేశ్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి.
తాజాగా ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి రాకేశ్‌రెడ్డి మాట్లాడారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వర్మ అసహనం వ్యక్తం చేస్తూ ఆయనతో సినిమా తీసే యోచన లేదని తాజాగా ప్రకటించాడు వర్మ.
‘‘రాకేశ్ రెడ్డి ఈ ఇంటర్వ్యూ లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ అబద్ధాలు చెప్పడం వైఎస్ఆర్సీపీలోని పెద్దలని మోసం చెయ్యడానికా? లేదా ఇంకెవరినైనా మోసం చెయ్యడానికా అనేది ఆయనకే తెలియాలి. నాకు ఆయనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పడానికి ఈ నోట్ విడుదల చేస్తున్నాను. ఇట్లు, రామ్‌గోపాల్‌వర్మ’’అని ఓ ప్రకటనలో తెలిపారు.
మొదట అనుకున్న దాని ప్రకారం నాగార్జునతో చేస్తున్న ‘ఆఫీసర్’ సినిమా తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం 2018 ఏప్రిల్‌లో మొదలు పెట్టి సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తాజా ప్రకటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎవరితో తీస్తారో చూడాలి.