తమన్నా మెయిన్ లీడ్ గా తెలుగు,హిందీ,తమిళ భాషల్లో త్రిభాష చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘అభినేత్రి’.ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా,సోను సూద్ ప్రధాన పాత్రల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ల నుంచి భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన అభినేత్రి ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ :
ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా మొదలవుతుంది. కృష్ణ(ప్రభుదేవా) ముంబయిలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి అల్ట్రా మోడర్న్‌గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ.. కుటుంబ సభ్యుల బలవంతంతో పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్నా)తో వివాహమవుతుంది. ఇష్టం లేకపోయినా ఆమెను ముంబయి తీసుకొచ్చి ఓ అపార్టుమెంటులో కాపురం పెడతాడు. తనకు వివాహమైన సంగతి ఎవరికి చెప్పడు. ఇది ఇలా ఉంటే కృష్ణ.. దేవి ఉండే అపార్టుమెంటులోనే అంతకు ముందు రూబి(తమన్నా) అనే అమ్మాయి నివసించేది. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక తీరకముందే ఆమె మరణిస్తుంది. దీంతో దేవి శరీరంలోకి ప్రవేశించి తన కోరికను నేరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దేవి ప్రవర్తనలో మార్పు గమనించిన కృష్ణ ఆమెలో ఆత్మ చేరిందని తెలుసుకుంటాడు. మరోవైపు స్టార్ హీరో రాజీవ్(సోనూసూద్) దేవిని ఇష్టపడుతుంటాడు. దేవిలో ప్రవేశించిన ఆ ఆత్మను కృష్ణ ఎలా హ్యాండిల్ చేశాడు? తన భార్యను ఎలా కాపాడుకున్నాడన్నదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,ప్రభుదేవా,తమన్నా.ప్రభుదేవా వెండితెరపై చాలా కాలం తర్వాత డాన్స్ చేసి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. నటన పరంగానూ అతని మార్కుని చూపించాడు. ప్రభుదేవాలో ఉన్న కామెడీ యాంగిల్ ఈ చిత్రానికే హైలైట్. తమన్నా.. రెండు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రభుదేవాకి దీటుగా తమన్నా కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసింది.ప్రత్యేక గీతంలో అమీ జాక్సన్ ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథనం,సెకండాఫ్. కథ బాగానే రాసుకున్నా….తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. కథ సాగతీత.. అనవసరమైన పాటలు.. సన్నివేశాలు కాస్త నెమ్మదిస్తుంది.హర్రర్ కామెడీ చిత్రం అని ప్రచారం చేయబడ్డ ఈ సినిమాలో ఆ ప్రచారానికి పూర్తి న్యాయం జరగలేదు. కథనం కాస్త రొటీన్ కావడంతో సినిమాలో ముందు ముందు ఏం జరగబోతోందో ఊహించవచ్చు.
సాంకేతిక విభాగం :
ప్రభుదేవా కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఆయన డ్యాన్సులన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘చిల్..’ పాటలో అమీ జాక్సన్, రాజు సుందరం అప్పియరెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండటంతో పాటు గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాని మూడు భాషల్లో తీయడం వలన ఎడిటింగ్ సరిగా రాలేదు. దర్శకుడు
తీర్పు :
హారర్ కామెడీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీఎప్పుడూ పగ ప్రతీకారాలంటూ వచ్చే హారర్ స్టోరీలకు భిన్నంగా స్టార్ అవ్వాలన్న కోరిక ఉన్న ఆత్మ ఆలోచనతో తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ప్రభుదేవా టైమింగ్ కామెడీతో హారర్ కన్నా.. కామెడీయే ఎక్కువ పండింది. ప్రభుదేవా- తమన్నా.. తమన్నా-సోనూసూద్ పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగుంది. కాన్సెప్టు కొత్తగా ఉన్నా.. తెరపై మరింత బాగా కనిపించేలా చేస్తే బాగుండేది. మొత్తంగా అభినేత్రి ఓసారి చూడదగ్గ సినిమా.
విడుదల తేది:07/10/2016
రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రభుదేవా, తమన్నా
సంగీతం : సాజిద్ – వాజిద్, విశాల్ మిశ్రా
నిర్మాత : ఎంవివి సత్యనారాయణ
దర్శకత్వం : ఏ.ఎల్ విజయ్