ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు (61) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు హైదరాబాద్ SRనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
అక్టోబరు 10, 1956లో విజయవాడలో జన్మించిన హనుమంతరావు 18 ఏళ్ల వయసులో నాటకాల్లోకి ప్రవేశించారు. నాటకాల్లో ఆయన తొలిసారి రావణబ్రహ్మ వేషాన్ని వేశారు. తర్వాత స్టేజి షోలతో బాగా పాప్యులర్ అయ్యారు. ‘సత్యాగ్రహం’ సినిమాతో చిత్రపరిశ్రమలో కాలుమోపారు. మొత్తం 400 సినిమాల్లో నటించిన ఆయన అమృతం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. ఆనారోగ్యం కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.. సినిమాలకు ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.