ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ )లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ముంబై బ్రాంచ్‌లో రూ.11 వేల 550కోట్ల కుంభకోణం జరిగింది. ఈ విషయాన్ని ఆ బ్యాంకే బుధవారం (ఫిబ్రవరి-14) వెల్లడించింది. ఇది ఇతర బ్యాంకులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముంబైలోని ఆ బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారికి లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది.
ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకునేందుకు వీలుగా దర్యాప్తు ఏజెన్సీలకు నివేదించామని, స్వచ్ఛమైన, పారదర్శక బ్యాంకింగ్ సేవలకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఈ కుంభకోణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఈ స్కాంపై విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది పీఎన్‌బీ .
కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకును 280 కోట్ల రూపాయలకు మోసం చేశాడనే ఆరోపణలపై ఇప్పటికే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై విచారణ జరుగుతుంది. మరో ముగ్గురిపైన సీబీఐ వారం క్రితమే కేసు పెట్టి విచారణ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.11వేల కోట్ల కుంభకోణం బయటడడంతో స్టాక్ మార్కెట్ లో బ్యాంక్ షేర్ల విలువ పడిపోయింది. ఒక్కో షేరు 15 రూపాయలు నష్టపోయింది. ప్రస్తుతం రూ.145 దగ్గర ట్రేడ్ అవుతుంది.