చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన…

182
All-round India crush South Africa by 124 runs
- Advertisement -

టీమిండియా మళ్లీ అదరగొట్టింది. సఫారీ గడ్డపై వరుసగా మూడో వన్డే విజయంతో సిరీస్‌ విజయానికి మరో అడుగు దూరంలో నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్‌ 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికా కుల్దీప్‌ (4/23), చహల్‌ (4/46) మాయాజాలానికి 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. జేపీ డుమిని (67 బంతుల్లో 51; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.

అంతకముందు టాస్ గెలిచి భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రబడ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్‌ (0) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సున్నా వద్దే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా… రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు.

All-round India crush South Africa by 124 runs

ముఖ్యంగా కెరీర్లో గుర్తుండిపోయే గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లి శ్రమ ఊరికే పోలేదు. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు జోరు కొనసాగిస్తూ ప్రత్యర్థి పని పట్టారు. విరాట్‌ (160 నాటౌట్‌; 159 బంతుల్లో 12×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు, శిఖర్‌ ధావన్‌ (76; 63 బంతుల్లో 12×4) మెరుపులు తోడవడంతో మొదట భారత్‌ 6 వికెట్లకు 303 పరుగులు చేసింది. 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఆపై జోరు పెంచాడు. మూడో అర్ధశతకాన్ని 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. అతడి ధాటికి చివరి 5 ఓవర్లలో భారత్‌ 47 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 150 మార్కు దాటిన విరాట్‌.. చివరి రెండు బంతులకు 6, 4 కొట్టి స్కోరును 300 దాటించాడు.

- Advertisement -