ఎప్పుడు బబ్లీ గర్ల్ గా కనిపించే అనుష్క శర్మ ఇప్పుడు మాత్రం ఊహలకు అందని రీతిలో భయపెట్టే అవతారంతో ముందుకు వచ్చింది. అదే బాలీవుడ్ మూవీ ‘పరి’. ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ప్రరంబత చటర్జీ రజత్ కపూర్ రీతాబరి చక్రవర్తి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యాభై సెకండ్ల టీజర్ ఇవాళ విడుదల చేసారు. అనుష్క శర్మ గతంలో ఎన్నడు చూడని తరహాలో హారర్ సినిమాలో నటించడం ఒక ట్విస్ట్ అయితే దెయ్యం కూడా తనే కావడం పరి ప్రత్యేకత.
పేపర్ పైన గీసిన కొన్ని పెన్సిల్ స్కెచ్చులు. నిజ జీవితంలో అచ్చంగా అలాంటివే కొన్ని సంఘటనలు. వీటికి లింక్ చేస్తూ ఇంట్లో ఒంటరిగా ఉండే భార్యా భర్తల మధ్య యేవో అపోహలు. తీరా చూస్తే అంతు చిక్కని రీతిలో చావులు కేకలు చేజులు వెరసి కూసింత ఆసక్తికరంగానే ఉంది టీజర్. ముఖ్యంగా చివర్లో అనుష్క ఒక రూమ్ లో దెయ్యం ఓ బిడ్డకు రక్తాన్ని పాల సీసాలో పడుతుండగా దగ్గరికి వెళ్లి చూసిన తనకు అది తన రూపంలోనే ఉండటం చూసి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ అసలు ఆకర్షణ నిలుస్తుంది.
హాలీవుడ్ తరహా మేకింగ్ తో ఆకట్టుకునే ఉన్న ఈ టీజర్ ని షేర్ చేస్తూ అనుష్క శర్మ ఇది ఆహ్లాదకరమైన కథ కాదని ముందే భయాన్ని నింపేస్తుంది. ‘పరి’ మూవీ ఊహించని మలుపులతో ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో భయపెట్టడం ఖాయం అనిపించేలా ఉంది. దెయ్యం పాత్రలో అనుష్క శర్మను చూసి కోహ్లీ ఏమంటాడో కాని ప్రేక్షకులు మాత్రం జడుసుకుంటున్నారు.ఈ మూవీ హోలీ సందర్భంగా మార్చ్ 2న ‘పరి’ విడుదల కానుంది.