సీఐ అదృశ్యం నల్గొండ జిల్లాలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు, నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, కనగల్లుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య కేసుల్లో.. పని ఒత్తిడి, ఉన్నతాధికారులు మందలించారన్న మనస్తాపంతో సీఐ ఠాణా నుంచి వెళ్లిపోయారు.
తన సర్వీసు రివాల్వర్‌ను డ్రైవర్‌కు, సిమ్‌కార్డును మాడ్గులపల్లి పోలీసు స్టేషన్‌లోను అందజేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉండడంతో ఆయన ఎక్కడున్నారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంటకు చెందిన సీఐ వెంకటేశ్వర్లు…నల్లగొండ నుంచి గరిడేపల్లి వెళ్లే మార్గంలో మాడ్గులపల్లి స్టేషన్‌లో సిమ్‌కార్డును అందజేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు వెంకటేశ్వర్లు ఇటు కుటుంబ సభ్యులకు, అటు డిపార్ట్‌మెంట్ వ్యక్తులకు అందుబాటులోకి రాలేదు.
ఈ కేసులో ఏ-1 నుంచి ఏ-5 వరకు సెక్షన్ 302 హత్య కేసు, ఏ-6 నుంచి ఏ-11 వరకు సెక్షన్ 202 వర్తిస్తుందని సీఐ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అందరికీ సెక్షన్ 302 వర్తించేలా రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పిస్తారు. ఇక్కడ అందుకు భిన్నంగా జరగడం, ఓ వైపు కాంగ్రెస్ పెద్దలంతా పోలీసులు, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటంతో వెంకటేశ్వర్లుపై పోలీసు ఉన్నతాధికారులు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐ ఎవరికి చెప్పకుండా వెళ్లినట్లు సమాచారం.