అంతా అనుకున్నట్లే జరిగింది. విదేశీ గడ్డపై భారత్ రాణించలేదు అన్న విమర్శకుల మాటలు నిజమయ్యేలా కోహ్లిసేన సఫారీ జట్టు చేతిలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్‌కు నిర్ణయాత్మకంగా మారిన రెండో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 135 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి 2-0తో సిరీస్ చేజార్చుకుంది.
286 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది. నాలుగోరోజు ఓవర్‌నైట్ స్కోరు 35/3తో బ్యాటింగ్ ఆరంభించిన భారత బ్యాట్స్ మెన్ ఏ దశలోనూ లక్ష్యచేదన దిశగా అడుగులు వేయలేకపోయారు. రోహిత్ శర్మ (47; 74 బంతుల్లో 6×4, 1×6) మినహాయిస్తే మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూకట్టారు.
భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3, షమీ 28, ఇషాంత్ శర్మ 4 (నాటౌట్), బుమ్రా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 6 వికెట్లు తీయగా రబాడా 3 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేసింది.
కాస్త మెరవడంతో అద్భుతం జరుగుతుందా అని అభిమానులు ఆశించారు. కానీ మరో మూడు పరుగులు చేస్తే అర్ధశతకం పూర్తవుతుందనగా రబాడ వేసిన 47.2వ బంతికి అతడు పెవిలియన్ చేరాడు. అతడి క్యాచ్‌ను ఏబీ డివిలియర్స్ పరిగెత్తుతూ వచ్చి ఒడిసిపట్టాడు. ఆ తర్వాత షమి (28), బుమ్రా (2) ఔట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి 6 వికెట్లు తీసి అరంగేట్రంలోనే సత్తా చాటాడు.