రేవంత్ రెడ్డి ఓ పొలిటికల్ బఫూన్ అంటూ మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ సుమన్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అనుచరులు దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధపడితే తెలంగాణ ప్రజలు పట్టపగలు డబ్బులు పంచుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగతో చర్చేంటని అన్నరని ఎంపీ సుమన్ అన్నారు. రేవంత్ రెడ్డి పదేపదే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, 2008లో జీవో నెంబర్ ఎం.ఎస్ 53 జీవో కాపిలో స్పష్టంగా పేర్కొన్నారని, ఆనాడే స్పష్టంగా కేటాయింపులు జరిపారని, ఆ కేటాయింపులనే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఫాలో అయిందని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదని ఎంపీ సుమన్ అన్నారు.
విద్యుత్ కొనుగోళ్లలో భద్రాద్రి, యాదాద్రిలో అవకతవకలు జరిగాయని అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఇది రెండో అబద్ధమని అన్నారు. తనపై రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశాడని, ఎవరి విశ్వసనీయత ఏంటో చూసుకుందామని సవాల్ విసిరాడని, బాల్క సుమన్ విశ్వసనీయత ఏంటో ప్రపంచానికి తెలుసని, తాను తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్ననాడు, తెలంగాణలో ఉద్యమంలో తనను పోలీసులు కొట్టిననాడు, తనపై కేసులు పెట్టిననాడు, తెలంగాణ ఉద్యమంలో తాను జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పన్నడో తెలంగాణ ప్రజలందరికి తెలుసని, అసొంటి రేవంత్ రెడ్డి తనపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాను ఉద్యమం చేసిన నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడని, తెలంగాణ ద్రోహుల పక్కన చేరిన రేవంత్ రెడ్డి తనపై మాట్లాడడం ఏంటని బాల్క సుమన్ అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా చిల్లర పబ్లిసిటీ వస్తుందని రేవంత్ రెడ్డి భ్రమ పడుతున్నారని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది వచ్చారని, వెళ్లారని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని లేదంటే తాము కూడా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి బండారం బయటపెడతామని ఎంపీ సుమన్ పేర్కొన్నారు.
బాల్క సుమన్ పారిపోయే వ్యక్తికాదు.. రేవంత్ రెడ్డిలాగా పార్టీలు మారే వ్యక్తి కాదని, విలువలు, విశ్వసనీయత ఉన్న వ్యక్తి అని ఎంపీ సుమన్ అన్నారు. రేవంత్రెడ్డి, రేవంత్ లాంటి వెయ్యిమంది వచ్చినా తనను ఏం చేయలేరని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నదని, రైతును రాజును చేసే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అందులో భాగంగానే 24 గంటల కరెంటు సప్లై చేస్తుందని ఎంపీ సుమన్ అన్నారు.