గత కొన్నిరోజులుగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో అక్కినేని నాగచైతన్య – సమంతల పెళ్లి వ్యవహారం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన చైతు.. తమ కుటుంబంతో సమంత బాగా కలిసిపోయిందని అన్నాడు. సమంత, తాను ఒకేసారి సినిమాల్లోకి ప్రవేశించామని, దీంతో.. ప్రతి విషయాన్ని ఇద్దరం పంచుకున్నామని చెప్పాడు. ‘మనం’ చిత్రం అప్పటి నుంచే సమంత తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందని, అదేవిధంగా, తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా సమంతను తాము చూస్తామని చెప్పాడు. ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారనే విషయమై నాగ చైతన్య మాట్లాడుతూ, ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని, ‘ఏ మాయ చేశావే!’ చిత్రం అప్పటి నుంచి తామిద్దరం ఫ్రెండ్సేనని అన్నాడు.
ఇక సమంత మతం మార్చుకుందున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య…తనకు మతాలతో సంబంధం లేదనీ, మనుషులనే చూస్తానంటూ చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లినప్పుడు నాన్నగారు పూజ చేస్తూ ఉన్నారనీ, ఆయన పూజ ముగియగానే ఎలాగూ మీరు కూడా వచ్చారు కదా పూజ చేయండి అంటే తామిద్దరం కూర్చున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేతప్ప మతం మార్పిడి వ్యవహారం కాదని స్పష్టం చేశాడు.
తనకు చాలా ఇష్టమని…మలయాళ చిత్రమైన ‘ప్రేమమ్’ను మన నేటివిటీకి తగ్గట్లుగా తీశామని, ఈ చిత్రం మ్యూజికల్ హిట్ కూడా అయిందని అన్నాడు. అఖిల్ లవ్ విషయం తెలిసి తాను షాక్ అయ్యానని, ఈ విషయాన్ని తానసలు ఊహించలేదని అన్నాడు. అఖిల్ ప్రేమలో పడిన విషయాన్ని నాన్న కూడా ఊహించలేదు. ఒకరోజు, ఉన్నట్లుండి న్యూక్లియర్ బాంబు పేల్చినట్లు, ఈ విషయాన్ని చెప్పాడు. అయితే, ఈ విషయంలో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అఖిల్ చాలా తక్కువ టైమ్ లో తన ప్రేమ విషయమై నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం’ అని నాగచైతన్య చెప్పాడు.