బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కోపమొచ్చినట్టుంది. ప్రశ్నలడిగిన వారిపైనే కాస్త ఘరమౌతూ..ఎదురు ప్రశ్నిస్తోంది. అసలు విషయానికొస్తే..ఇటీవల జీ సినీ అవార్డుల వేడుకలో 5 నిమిషాల డ్యాన్స్ ప్రదర్శనకు ప్రియాంక చోప్రా రూ. 5 కోట్లు తీసుకుందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
ఇదే విషయం గురించి రిపోర్టర్లు ఆమెను ప్రశ్నించగా గట్టిగా సమాధానం చెప్పింది. తాను కష్టపడతాను కాబట్టి అందుకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని, ఇదే ప్రశ్నను హీరోలను ఎందుకు అడగరని ఆమె తిరిగి ప్రశ్నించింది.
‘నాకిచ్చే చెక్ మీద ఎన్ని సున్నాలున్నాయనే విషయాన్ని నేను పట్టించుకోను. నా ఆలోచనలెప్పుడూ ఆ సున్నాలకు తగిన న్యాయం చేశానా? లేదా? అనే విషయం చుట్టే తిరుగుతాయి. నేనీ స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఇది’ అని ప్రియాంక సమాధానమిచ్చింది.
ఈ ప్రశ్న తనను అడగడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని, హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నందుకు గర్వించాల్సింది పోయి విచారణలు చేపట్టడం సిగ్గుచేటని ప్రియాంక అంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న పారితోషిక లింగ భేదాల గురించి రిపోర్టర్లకు ఓ పెద్ద క్లాసు కూడా పీకింది.