విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాచురల్ స్టార్ నాని..త్వరలో మన్మథుడు నాగార్జునతో మల్టీస్టారర్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. శమంతకమణి సినిమాతో మల్టీస్టారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో బెస్ట్ అనిపించుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం హలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నానితో మల్టీస్టారర్ సినిమాపై స్పందించిన నాగ్ .. దర్శకుడు శ్రీరాం ఆదిత్య చెప్పిన కథ చాలా బాగుందని, అందుకే డెవలప్ చేయమని వెంటనే చెప్పేశానని అన్నారు. తనకు నాని కామెడీ టైమింగ్ చాలా ఇష్టమని, అతనితో చేస్తున్నందుకు హ్యాపీగా వుందని చెప్పారు.
అఖిల్ సినిమా కదా అని ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారా అని అంతా అడుగుతున్నారు. ‘రాజన్న’ని రూ.18 కోట్లతో తీశాం. ఆ సినిమాలో నాకంటే పాప పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొత్త దర్శకుల్ని నమ్మి భారీ సినిమాలు తీశాను. అప్పుడు ఎవరూ ఈ ప్రశ్న వేయలేదన్నారు.
ఈ సినిమా చూశాక చిరంజీవి గారు అఖిల్‌ని గట్టిగా వాటేసుకున్నారు. అది చూసి నాకళ్లలో నీళ్లు తిరిగాయి. ‘గీతాంజలి’, ‘శివ’ కంటే ముందు చాలా సినిమాల్లో నేను నటించినా ‘నాగార్జున బాగా చేశాడు’ అని ఎప్పుడూ అనలేదు. ‘గీతాంజలి’, ‘శివ’లకు మాత్రమే ఆ కాంప్లిమెంట్లు దక్కాయి. నేను ఎలాంటి పాత్రలకు సరిపోతానో అలాంటి పాత్రల్ని మణిరత్నం, వర్మలు ఇచ్చారు. ప్రస్తుతం అఖిల్ కూడా అదే స్థాయిలో ఉన్నాడని తెలిపారు.