కొలువుల కొట్లాట పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్ మున్సిపాలిటీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కొలువుల కొట్లాట కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆడుతున్న డ్రామా అని ఎద్దేవ చేశారు.
50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కోపం చేశారు. తమకు 60 నెలల అధికారం ఇచ్చారు. ఆనాటి వరకు లక్ష కాదు లక్షా పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మొసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్సే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాసులు ఢిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలో ఉన్నారని పేర్కొన్నారు.
అంతకముందు క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ ముందే లాటరీ తీసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేశామన్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. గతంలో ఇండ్లు కడితే లబ్దిదారులు అప్పుల పాలయ్యేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.