ఇవాంక ట్రంప్..గత కొన్నిరోజులుగా హైదరాబాద్ మీడియాలో మేజర్ న్యూస్‌గా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుత్రిక, ఆయన సలహాదారు అయిన ఇవాంక భాగ్యనగరంలో అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ,ఇవాంక ట్రంప్ పాల్గొంటున్నారు.
దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు నగరానికి వస్తుండడంతో హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే..ఈ నెల 28న ఇవాంకా ట్రంప్.. నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. రెండు విమానాశ్రయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో కలిసి ప్రత్యేక విమానంలో రానున్న ఆమె.. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వెస్టిన్ హోటల్లో బస చేస్తారు.
ఈ క్రమంలోనే ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ఇవాంకాకు భద్రత అంతా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులే పర్యవేక్షిస్తారు. అయితే ఇవాంక వెంట అమెరికా ప్రెసిడెంట్ స్థాయిలో భారీ సెక్యూరిటీ టీమ్ కూడా ఉంటుందని వార్తలు వెలువడుతున్నాయి.
అలాంటి వార్తల్లో వాస్తవం లేదని, ఇవాంక ట్రంప్ కేవలం డోనాల్డ్ ట్రంప్ సలహాదారుగానే నగరానికి రానున్నారని, ఆమె హోదాకు తగ్గట్టుగానే భధ్రతా సిబ్బంది ఉంటుందని అమెరికాకు చెందిన ఒక ఉన్నత భద్రతాధికారి తెలిపారు.
కాగా..ఇప్పటికే ఇవాంక పర్యటన కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు మైన్ ప్రూఫ్ కార్లు తెప్పించారు. మందుపాతరలు, తుపాకీ తూటాల నుంచి మాత్రమే కాదు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయి. ఏదేమైనా.. అమెరికా అధ్యక్ష స్థాయిలో మాత్రం ఆమెకు భధ్రత ఉండదని అమెరికా రక్షణ వర్గాల ద్వారా తెలుస్తోంది.