ఉగ్రమూకల పీచమణచేందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పొంచి ఉన్న నరహంతక టెర్రిరిస్టులను ఏరిపారేసేందుకు సర్జికల్ దాడులతో ముందుకు పోయింది. ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వే పాక్‌కూ హెచ్చరికలు జారీ చేసింది. దేశ సైన్యాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. అధికార-ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంలో భారత సైనిక చర్యని అభినందిస్తున్నారు. దేశంలో ఎన్ని బాషలున్నా, ఎన్ని కులాలు, మతాలు, పార్టీలు.. ఉన్నా దేశ భద్రత విషయంలో అందరిది ఒకే మాట.. ఒకే బాట అన్న విషయం మరోసారి సుస్పష్టమైంది. ఆ సర్జికల్ స్ట్రయిక్స్ అంశమే ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏమిటి..?
సర్జికల్ దాడి అంటే ఒక రకంగా యుద్ధమే. శత్రు స్థావరాలపై ఎదురుదాడి చేయడం. ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తుంది. కచ్చితమైన వ్యూహంతో ఎక్కువ విధ్వంసం జరగకుండా ఎంపిక చేసుకున్న లక్ష్యంపైనే నిశితంగా దాడులు చేయడాన్ని ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటారు. దీని వల్ల పరిసర ప్రాంతాలకు, సాధారణ పౌరులకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. కేవలం దాడి చేయాలనుకున్న లక్ష్యం మీదనే గురిచూసి సైన్యం దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అంటే ఉగ్రస్థావరాలను గుర్తించి పక్కాగా వాటిపైనే దాడులు చేసి ధ్వంసం చేస్తారు. తాజాగా, భారత సైన్యం చేసిందీ ఈ రకమైన దాదులే.
శత్రువు భూభాగంలోకి చొరబడి , మెరుపు వేగంతో వాళ్ళను అంతమొందించి, సురక్షితంగా తిరిగి తమ భూభాగానికి వచ్చేయడాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ అంటారు. ఈ దాడిలో ఎంచుకున్న లక్ష్యం మాత్రమే నేల మట్టమవుతుంది. దాని చుట్టూ ఉన్న ఇతర భవనాలు, వాహనాలు, సాధారణ పౌరుల ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా దాడులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో తమ బలగాలు గాయపడకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది ఆర్మీ.
క్కమాటలో చెప్పాలంటే ఇది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ. బృందంలోని సభ్యులందరి మధ్య సమన్వయం ఉండాలి. శత్రువు భూభాగం గురించిన స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒక్కటంటే ఒక్క తప్పటడుగు కూడా పడకూడదు. మెరుపు దాడి చేసి మాయమవ్వాలి. సైన్యంలో బెస్ట్ అనుకున్న వాళ్ళే ఈ బృందంలో ఉంటారు.
పక్కా ప్రణాళిక, లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలమన్న విశ్వాసం ఉంటేనే ఆర్మీ బలగాలు సర్జికల్ దాడులకు దిగుతాయి. జూన్ లో నాగా తిరుగుబాటుదారులపై ఇలాంటి దాడులే నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. 70 మంది కమాండోలు శత్రు స్థావరాలపై 40 నిమిషాల వ్యవధిలో మెరుపుదాడి చేసి 38 మంది తిరుగుబాటుదారులను మట్టుబెట్టారు. దౌత్యపరంగా ఒత్తిడులు విఫలమైనప్పుడు, ఉన్నపళంగా శత్రు మూకల నుంచి వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ సర్జికల్ దాడులను నిర్వహిస్తాయి.