కోలీవుడ్ బ్యూటి నయనతార ఇప్పుడు మంచి జోరు మీదుంది. ఒక దశలో నయన్‌కు సినిమా అవకాశాలు తగ్గిపోవడం.. మరోవైపు ప్రభుదేవాతో పెళ్లి వరకు వ్యవహారం వెళ్లడంతో నయనతార కెరీర్ ముగిసిందనే అనుకున్నారంతా. కానీ అతడితో బ్రేకప్ తర్వాత నయన్ దశ తిరిగిపోయింది. వరుసగా హిట్లు కొడుతూ.. క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటూ మళ్లీ తిరుగులేని స్థాయికి చేరుకుందామె. ‘మయూరి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ ఫిలింతో ఆమె ఇమేజే మారిపోయింది. తాజాగా నయన్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ ఫిలిం తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
నయనతార తాజా చిత్రంగా తమిళంలో ‘అరమ్’ అనే సినిమా ఈ శుక్రవారం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ‘అరమ్’ అనే మాటకి న్యాయం చేయండి, ధర్మం చేయండి వంటి అర్థాలు వస్తాయి. గోపీ నయనార్ తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో, ప్రజల కష్టాలను రాజకీయ నాయకుల ముందుంచి ప్రశ్నించే కలెక్టర్ పాత్రలో నయనతార నటించింది.
ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఆలోచన రేకెత్తించేలా సాగుతుందని అంటున్నారు. ఈ ఏడాది బెస్ట్ తమిళ్ సినిమా ఇదే అని సమీక్షకులు కితాబిస్తుండటం విశేషం. ముఖ్యంగా నయనతార పెర్ఫామెన్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమెను లేడీ సూపర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.