మాట నిలబెట్టుకున్న కేసీఆర్…

207
Power a success story: KCR
- Advertisement -

చరిత్రలో మొదటిసారిగా ఫ్రీ కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కందన్నారు సీఎం కేసీఆర్. శాసనసభలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ పంపిణీపై మాట్లాడిన సీఎం చరిత్రలో తొలిసారి 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.  ప్రస్తుతం 25 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల కరెంటు ఉండగా..మెదక్ లో 24 గంటల కరెంటు వస్తుంది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉచిత కరెంటును ఇవ్వనున్నామన్నారు. అవసరమైతే వచ్చే రబీ నుంచే అమలు చేస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలుండేవని, కావాల్సిన కరెంటులేకపోవడంతో ఎన్నో పరిశ్రమలు మూత పడ్డాయన్నారు. వ్యవసాయనికి 3 గంటలు మాత్రమే కరెంటు రావడంతో పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యలు చూశాం. కానీ నేడు 11 వేల మెగావాట్ల డిమాండ్‌కు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ లైన్ల ద్వారా ఎక్కడి నుంచైనా విద్యుత్ పొందే వీలుందన్నారు.

చిమ్మచీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా హైటెన్షన్ లైన్ల సామర్థ్యం పెంచామన్నారు.

డిస్కంల రుణభారాన్ని తగ్గించేందుకు రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరిందని తెలిపారు. రైతులు ఆటో స్టార్టర్లను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సీఎం. భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఆటో స్టార్టర్లను తొలగించాలని సూచించారు. సబ్‌స్టేషన్ల సంఖ్యను పెంచుతున్నాం, కొత్త ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు. 4 వేల మెగవాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. ఈ పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించామని తెలిపారు. 2792 మెగావాట్ల సోలార్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. విద్యుత్ శాఖలో 13,357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు సీఎం.

- Advertisement -