రైతే రాజు కావాలి..:సీఎం కేసీఆర్

217
KCR on Updation of Land Records
- Advertisement -

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతే రాజు కావాలనే సంకల్పంతో ప్రభుత్వం భూసర్వేని చేపట్టిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం….వ్యవసాయం దండగ కాదు పండగ అని చేసిచూపుతామన్నారు.

వచ్చే ఏడాది జనవరి 26న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని  ప్రకటించారు.  జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మునుపెన్నడూ లేని విధంగా రైతుల్లో సంతోషం నింపుతామని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇచ్చే పెట్టుబడి రైతుల ఖాతాల్లోకి నేరుగా చేరుతుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలని సీఎం కోరారు.

ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. ఇప్పటికీ 5 శాతం లోపే పత్తి మార్కెట్‌లోకి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల మంచి పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువనే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

పంట కాలనీలు వేసి.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెట్టే కార్యక్రమం చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్ యార్డు ధ్వంసంలో కాంగ్రెస్ నేతల హస్తముందన్నారు సీఎం.

గతంలో మాదిరిగా పాస్‌బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్‌పోర్టు తరహాలో పటిష్టంగా పాస్‌బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు నెల రోజులు నీటిలో పడేసిన ఏం కాదన్నారు. వాటర్ ప్రూఫ్‌తో ఉంటుందన్నారు. ప్రత్యేకమైన పెన్నుతో రాస్తేనే దానిపై పడుతుందన్నారు. ఇష్టమొచ్చిన పెన్నుతో రాస్తే దానిపై పడదన్నారు. సంబంధిత అధికారులకు కేటాయించిన స్పెషల్ పెన్నులతోనే ఆ పాస్‌బుక్స్‌పై రాసేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రతి రైతుకు ఒక సర్వే నంబర్ కేటాయించాలనేది తన ప్రతిపాదన అని సీఎం తెలిపారు. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఒకే సర్వే నంబర్ ఇస్తే బాగుంటుందని సీఎం చెప్పారు.

- Advertisement -