కేసీఆర్ వరంగల్‌ పర్యటనకు సర్వం సిద్ధం..

160
- Advertisement -

వరంగల్ నగరానికి సరికొత్త శోభను చేకూరుస్తూ నాలుగు ప్రతిష్ఠాత్మక ప్రగతి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. వస్త్రప్రపంచంలో ఒకనాడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లు నగరానికి.. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతో పునర్వైభవం రానున్నది. రాష్ర్టానికి మరో ఆర్థిక రాజధానిగా ఎదిగే క్రమంలో భాగంగా 74కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్‌రోడ్డుకు కూడా సీఎం భూమిపూజ చేయబోతున్నారు. ఈ రెండింటితోపాటు మడికొండ ఐటీపార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ రెండోదశ పనులకు, కాజీపేట రెండో రైల్‌రోడ్ వంతెనకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 3.30 గంటలకు వరంగల్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడే నాలుగు ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.45గంటలకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Telangana CM to lay foundation stone for Kakatiya textile park today

4.55గంటలకు మెగాటెక్స్‌టైల్ పార్కు స్థలం నుంచి హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయలుదేరి వెళ్తారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనకు, శంకుస్థాపన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహిరంగ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు తరలి వస్తున్నారు. వస్త్రనగరి కోసం ఏర్పాటు చేసిన 1200 ఎకరాల స్థలంలో సీఎం కేసీఆర్ సభకు అన్ని హంగులతో భారీగా ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం భారీ శిలాఫలకాలను సిద్ధం చేశారు. గత పదిరోజులుగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అధికారులు ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించడంతో అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యాయి. సీఎం పర్యటన, సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని చెప్పారు.

Telangana CM to lay foundation stone for Kakatiya textile park today
వరంగల్ జిల్లాపై కేసీఆర్‌కు ఎంతో అభిమానం ఉందని, వందల కోట్ల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని వివరించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు వరంగల్ జిల్లాకు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఈ వస్త్రనగరిలో రూ.11వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. ఈ పార్కు నిర్మాణంతో 1.20లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలను చూసి ప్రజలు పార్టీకి అండగా నిలుచున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు కాలంచెల్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగసభ ద్వారా టీఆర్‌ఎస్ బలం మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట్ర గొర్రెలు మేక ల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, నాయకులు గుడిమళ్ల రవికుమార్, పోలీసు ధర్మారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..

మధ్యాహ్నం 2.30: బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు పయనం.
మధ్యాహ్నం 3.30: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట పరిధిలో మెగా టెక్స్‌టైల్ పరిశ్రమ స్థలానికి చేరుకొని.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డు, కాజీపేట రెండో ఆర్వోబీ, మడికొండ ఐటీ పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 3.45: అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 4.55: హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరుతారు.
సాయంత్రం 5.55: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

- Advertisement -