ఓరుగల్లుకు పూర్వ వైభవం

285
Kakatiya Textile for Weavers Welfare
- Advertisement -

వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో నిర్మించబోయే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. శంకుస్థాపన అనంతరం జరిగే సీఎం బహిరంగ సభకు కూడా పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకానుంది.   టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల భూమి సేకరించింది. ఫైబర్‌ టు ఫ్యాషన్‌ పద్ధతిలో నూలు పోగు నుంచి వస్ర్తాల తయారీకి కావాల్సిన అధునాతన వసతులతో ఏర్పాటుకానుంది.   అత్యుత్తమ టెస్టింగ్‌ లేబొరేటరీతో పాటు పార్కు మొత్తం జీరో లిక్విడ్‌ డిశ్చార్జీ విధానంతో కాలుష్యం తగ్గేవిధంగా ఏర్పాట్లుచేశారు.

పత్తి ఉత్పత్తిలో రాష్టంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో స్థానంలో వుంది. జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. వరంగల్ తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్ కే పత్తిని తీసుకొస్తున్నారు. ఇక్కడ తయారైన పత్తి బేళ్ళను కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహం లభించనుంది.

Kakatiya Textile for Weavers Welfare
ఇప్పటికే దేశ, విదేశాల నుంచి 12 కంపెనీలు రూ.3 వేల కోట్ల పెట్టుబడులకు అంగీకరించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా 44 వేల మందికి, మొత్తంగా 66 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పార్కునకు అనుబంధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో 8 కంపెనీలు ముందుకొచ్చాయని కేటీఆర్‌ తెలిపారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు లోగో, పైలాన్‌ను టీఎ్‌సఐఐసీ ఆకట్టుకునేలా తయారు చేసింది. టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఉన్నతిని, తెలంగాణ స్ఫూర్తిని చాటేలా పైలాన్‌ను రూపొందించారు. పరిశ్రమకు ప్రాణమైన దారపు కండె మధ్యలో ఉంచి, దాని చుట్టూ నిలువెత్తు రంగురంగుల దారాల పోగుల మాదిరి డిజైన్లతో పైలాన్‌ ఆకర్షణీయంగా ఉంది.

- Advertisement -