హైదరాబాద్ నుండి వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందని తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా హరిత హోటల్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకే చోట తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్దిక రాజధాని అవుతుందని తెలిపారు.
బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీకి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న ఊళ్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాని వెల్లడించారు. రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు జరుగుతాయని, 1.20 లక్షల మందికి ఉపాది అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కళాశాలతో ఎంఓయు కుదుర్చుకుంటున్నాట్లు చెప్పారు. ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు.
అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత ప్రేరణ పొందే విధంగా కేటీఆర్ ఉపన్యాసం సాగింది. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సమస్యలను ధీటుగా ఎదుర్కోవడమే అసలైన సవాల్ అని పేర్కొన్నారు. జీవితంలో రాణించాలంటే మానసికంగా, ధృఢంగా ఉండాలి. మానసికంగా, ధృఢంగా ఉంటే ఏదైనా సాధించగలమని స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. సమ్యలను ఎదుర్కోనేందుకు టాస్క్ లో నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు.
త్వరలోనే వరంగల్‌లో ఐటీ పార్క్, టెక్స్‌టైల్స్ పార్క్‌ను నెలకొల్పుతున్నామని తెలిపారు. త్వరలో మడికొండలో రూ. 25 కోట్లతో ఐటీ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టాస్క్ సేవలను వరంగల్ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతకముందు హన్మకొండలోని ఆర్ట్ప్ అండ్ సైన్స్ కళాశాల మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రి కేటీఆర్‌కి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ఆమ్రపాలి, మున్సిపల్ కమిషనర్ కృతీఓజా, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, కుడా చైర్మన్ మర్రి యాదవ్‌రెడ్డి, నగర మేయర్ నన్నపునేని నరేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పుష్పగుచ్ఛాలతో మంత్రికి స్వాగతం పలికారు. పర్యటనలో కేటీఆర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, వినయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.