అనంతగిరి కొండల్లో బయలెల్లిన మూసీ ఒయ్యారాలు ఒలకబోస్తూ పరవళ్లు తొక్కుతుంటే భాగ్యనగరం మురిసిపోయింది. తన దప్పిక తీర్చుకుంది. పొలం దున్ని పచ్చని పంటలు పండించింది. పిల్లా పాపలతో కళకళలాడింది. ఇదంతా ఒకప్పటి కథ.
కానీ కాలం మారింది. మనుషులూ మారారు. నాగరికత పెరిగింది. నగరీకరణవైపు అడుగుల వేగం పెరిగింది. ప్రపంచీకరణ వైపు పరుగు పందెం మొదలైంది. నగరం జనారణ్యంలా విస్తరించింది. పరిశ్రమలు పోటెత్తాయి. ప్రకృతి వైపరీత్యాలూ ప్రభావం చూపాయి.ఈ క్రమంలో నగర మనిషి జీవన వికాసానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన మూసీ పరవళ్లు గత వైభవంగా మిగిలిపోయాయి. విచారకరమైన పరిస్థితుల్లో మూసీ నది విశ్వనగరం మధ్యలో ఒక పెద్దపాటి మురుగు కాల్వగా మారిపోయింది.
వికారాబాద్ అటవీ ప్రాంతంలో పుట్టిన మూసీ, ఈసా నదులు రెండూ సమాంతరంగా ప్రవహిసూ,్త నగరంలోని లంగర్‌హౌజ్ బాపుఘాట్ వద్ద సంగమిస్తాయి. దానికే మూసీ నదిగా పేరు. అక్కడ నుంచి నల్గొండ జిల్లా వాడేపల్లి వద్దనున్న కృష్ణానదిలో కలుస్తాయి.
అదో ప్రళయం, మహోత్పాతం, వేలాది మందిని జల సమాధి చేసిన ప్రకృతి విపత్తు.. నగర చరిత్రలో అదో మానని గాయం. రాజధాని నగరాన్ని వరదలు ముంచెత్తి సరిగ్గా ఇవాళ్టికి 108 ఏళ్లు.
1908 సెప్టెంబర్ 28 రోజున హైదరాబాద్ నగరాన్ని మూసివరదలు ముంచెత్తాయి. ఆ వరదల ధాటికి నగరంలో మూడో వంతు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కేవలం 48 గంటల్లో 15వేల మంది మరణించారు. 80వేల ఇళ్లు కూలిపోయాయి.
1908 సెప్టెంబర్ 26, 27 తేదిల్లో 32.5 సెం.మీ అసాధారణ వర్షపాతంతో చెరువులు, కుంటలన్నీ నిండిపోయాయి. సెప్టెంబర్ 28 వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. 440 మిల్లీమీటర్ల వర్షపాతంతో ఎడతెరపి లేకుండా కురిసింది. మూసీకి ఇరు వైపులా నీటి మట్టం పెరిగింది. వరద నీరు నగర వీధుల్లో పొంగి పొర్లింది.
అఫ్జల్ గంజ్ వంతెనతో పాటు మూసీ పరివాహక ప్రాంతమంతా నీటమునిగింది. 19వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 15, 000 మంది మరణించారు. సుమారు 50, 000 మంది చనిపోయినట్లు లండన్ పత్రిక, బొంబాయి ఎడిషన్‌లో ప్రచురితమైన వార్త చెబుతుంది. 80వేల మంది దిక్కులేనివారయ్యారు. అప్పట్లోనే రూ.20 కోట్లు నష్టం వాటిల్లింది.
అక్టోబర్02, 1908 లండన్ పత్రికలో ప్రచురితమైన వార్త ప్రకారం ‘ఒక్క ప్రదేశంలోనే 600 మంది మృతదేహాలను వెలికితీసినటు’ తెలిపారు. అంతేకాదు రాత్రింబవళ్లు దహన సంస్కారాలు జరిగినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. వరదల సమయంలో కొందరు వేదపండితులు, హిందూ ధర్మశాస్త్ర నిపుణులు నిజాం ప్రభువుకు సలహా ఇచ్చారు.
కన్నెర్రచేసిన మూసీ నదీమ్మ తల్లికి శాంతిపూజ చేయాల్సిందిగా కోరారు. షేర్వాణీతోగాక పంచె, ధోవతీతోనే పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరారు. వారి మాటను మన్నించిన మహబూబ్ అలీఖాన్ మూసీ నది శాంతించాలంటూ పూజచేశారు. మతాచారాలు గాలికొదిలేశావంటూ విమర్శలొచ్చినా ప్రతిగా ‘‘రాజుగా ప్రజల కోసం, వారి ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించడం నా బాధ్యత’’ అని సమాధానమిచ్చినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.
వరద ఎల్లువ తరుముతున్న సమయంలో, ఉస్మాన్ ఆసుపత్రి ప్రాంగణంలోని చింత చెట్టు ఎంతో మందికి రక్షణ ఛత్రిగా నిలిచింది. వరద ముప్పు నుంచి తప్పించుకునేందుకు 150 మంది ఆ చెట్టు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అంతమందికి ప్రాణబిక్ష పెట్టిన ఆ చెట్టును ఆ నాటి నుంచి ప్రత్యేకమైన మహావృక్షంగా భావిస్తారు నగరవాసులు.