టాటూ కల్చర్ యువతను కొత్త పుంతలు తొక్కిస్తోంది. సినిమా స్టార్లు, క్రికెట్ ప్లేయర్లు, మోడళ్లు.. వీరువారు అని తేడాలేదు. శరీరంలో ఎక్కడపడితే అక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. దీంతో తాము అభిమానించేవారిని ఫాలో అవుతు టాటూ సెంటర్ల బాటపడుతోంది యువత. ఇంతకాలం వాచీమాటునో, ఫుల్హ్యాండ్స్ స్లీవ్స్ చాటునో దాగిన ‘పచ్చబొట్లు’ ఇప్పుడు సరికొత్త హంగులను సంతరించుకుంది. శరీరంపై ఫలానా చోటనే వేయాలనే రూల్ లేకుండా నచ్చిన చోట, నచ్చిన తీరులో తమ మనసులోని భావాలను టాటూల రూపంలో వ్యక్తపరిచేందుకు నవతరం ఉత్సాహం చూపుతోంది.
ఇందులో బాగంగానే ఓ టాటూ ఆర్టిస్ట్ ఎవరు చేయని సాహసానికి ఒడిగట్టాడు. స్వతహాగా టాటూ ఆర్టిస్ట్ కావడం వల్లే ఏమో.. ఏకంగా కళ్లపై టాటూ వేయించుకున్న తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు తన ఒంటి మీద ఎన్నో టాటూలు వేయించుకున్నాని… కానీ కళ్లో వేయించుకున్న టాటూ తన జీవితంలోనే గొప్పదని కరణ్ అంటున్నాడు.
పదమూడేళ్లప్పుడు తను మొదటి టాటూ వేయించుకున్నాని… 16 ఏళ్లప్పుడు టాటూ ఆర్టిస్టుగా వృత్తి మొదలు పెట్టినట్టు కరణ్ తెలియజేశాడు. ఇప్పటి వరకు తన ఒంటి మీద లెక్కలేనన్ని టాటూలు, 22 పీయర్సింగ్ (రింగు కుట్లు) ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఇలా కనుగుడ్డు మీద టాటూలు వేయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రమాదాలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల కెనడాకు చెందిన ఓ మోడల్ తన కళ్లపై టాటూ వేయించుకోవడానికి ప్రయత్నించి కంటి చూపును పాక్షికంగా కోల్పోయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇదేం పిచ్చిరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టుచేస్తున్నారు.