మీ వాహనంలో మీరు ప్రతి రోజూ పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకొనే ఉద్యోగాలకు వెళ్తారా..? లేదా వారానికోసారి పెట్రోల్ పోయించుకుంటారా..? మీరు ఎలా మెయిన్ టైన్ చేసినా.. ఈ సారి మాత్రం కాస్త స్టాక్ పెట్టుకోవాల్సిందేనండోయ్. ఎందుకంటే దేశవ్యాప్తంగా వున్న పెట్రోల్ బంకులు ఈ నెల 13న బంద్ పాటించనున్నాయి.
అపరిష్కృతంగా వున్న తమ డిమాండ్లని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వున్న పెట్రోల్ బంకులు ఈ నెల 13న బంద్ పాటించనున్నాయి. ఈమేరకు ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ లోద్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఉదయ్ లోద్.. దేశవ్యాప్తంగా సుమారు 54,000 పెట్రోల్ బంకులు ఈ బంద్‌లో పాల్గొననున్నట్టు చెప్పారు.
పెట్రోలు బంకులకి సంబంధించి దేశవ్యాప్తంగా వున్న మూడు పెద్ద అసోసియేషన్లని కలుపుకుని పనిచేస్తోన్న యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్ నేతలతో కలిసి చర్చించిన అనంతరం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం అని అన్నారు ఉదయ్ లోద్. ‘పెట్రోల్ బంకుల డీలర్ల డిమాండ్ల జాబితాలో డీలర్ల మార్జిన్లు, అన్యాయంగా విధించే జరిమానాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో గతేడాది నవంబర్ 4న చేసుకున్న ఒప్పందం అమలు వంటి అంశాలు వున్నాయి.
మా ఆందోళనల్లో భాగంగా మొదటి దశలో ఈ నెల 13న తాము పెట్రోల్, డీజిల్ కొనుగోలు, అమ్మకాలు నిలిపేసి నిరసన వ్యక్తంచేస్తాం. ఒకవేళ తమ డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించకపోతే, అక్టోబర్ 27వ తేదీ నుంచి నిరవధిక బంద్‌లకి పాల్పడుతాం’ అని ఉదయ్ లోద్ తెలిపారు.