అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధినేత బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. గుర్మీత్ ప్రస్తుతం జైలులో ఉండగా ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసు కస్టడీలో ఉన్న ఉంది. అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో చోటుచేసుకున్న అల్లర్లకు ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ కారణమని పోలీసులు తేల్చారు.అప్పుడు జరిగిన అల్లర్ల కోసం హనీప్రీత్ రూ.1.25కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.
ఆగస్టు 25న హరియాణాలోని పంచుకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. విచారణ నేపథ్యంలో అప్పటికే పంచుకులకు భారీగా చేరుకున్న గుర్మీత్ అనుచరులు, భక్తులు తీర్పు వెలువడిన అనంతరం పెద్దఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటనల్లో 30 మందికిపైగా మృతిచెందారు. అయితే ఈ అల్లర్లకు మాస్టర్‌మైండ్ హనీప్రీతేనని పోలీసులు తెలిపారు. కస్టడీలో ఉన్న గుర్మీత్ వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్ రాకేశ్ కుమార్‌ను విచారించగా ఈ విషయాలను వెల్లడించినట్లు చెప్పారు. కోర్టు తీర్పుకు రెండు రోజుల ముందు పంచకుల డేరా బ్రాంచ్ హెడ్‌కు హనీప్రీత్ రూ.1.25కోట్లు ఇచ్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
అయితే గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. హనీప్రీత్ విచారణకు సరిగా సహకరించట్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని హనీప్రీత్ మీడియాకు చెప్పడం గమనార్హం.