స్వదేశంలో విరాట్ సేన మరోసారి అద్భుత విజయంతో మెరిసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ని భారత్ ఘన విజయంతో ముగించి మళ్లీ వన్డేల్లో నెం.1 ర్యాంక్‌ని చేజిక్కించుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ అధికారికంగా నెం:1 స్థానానికి చేరుకోగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంకు పడిపోయాయి.
దీంతో టెస్ట్‌లు, వన్డేల్లోను భారత్ నెం:1 పీఠాన్ని సొంతగడ్డపై సిరీస్ విజయాలతోనే అధిగమించడం విశేషం. ఆదివారం నాటి ఐదో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 242/9 పరుగులు చేసింది. 243 పరుగుల లక్ష్యాన్ని భారత్ 43 బంతులు మిగిలి ఉండగానే అధిగమించింది.
రహానే, రోహిత్ తొలి వికెట్‌కు 124 పరుగులు, రెండో వికెట్‌కు కోహ్లీ, రోహిత్ 99 పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయాన్ని సునాయాసం చేశారు. తొలుత బౌలింగ్‌లో అక్షర్, జాదవ్ కీలకమైన సమయంలో వికెట్లతో సత్తా చాటి పర్యాటక జట్టు భారీ స్కోర్‌కు కళ్లెం వేశారు.